Showing posts with label తెలుగు. Show all posts
Showing posts with label తెలుగు. Show all posts

3 Jan 2010

శేషేంద్రజాలం

నీవు కాలేజికి పోతుంటే బాబూ
నిన్ను పొలాలు బిక్కమొహంతో చూస్తున్నాయి
నీవు కాలేజి గోడల్లోకి పోతావు
అక్కడ్నించి గవర్నమెంటు గోడల్లోకి పోతావు
ఆ తర్వాత ఎప్పుడూ ఎవ్వరూ
తిరిగిరాని గోడల్లోకి పోతావు
ఇక నీవు బ్రతికిందెప్పుడు?
బాబూ! నీ చిన్ని కన్నీటి బిందువులో
ఏ సముద్రం గర్జిస్తోందో నాకు తెలుసు
అందుకే చెట్లతో మొరపెట్టుకుంటున్నాను
ఆకులు కాదు తుపాకులు కాయండని-

ఇది రాసి ఎన్నేళ్ళయిందోగాని ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పేమీ లేదు. అప్పుడు గవర్నమెంటు గోడల్లోకి, ఇప్పుడు అమెరిక కలల్లోకి...

*********

బేటావాడ్ని మాత్రం నమ్మకు
వాడు జెండాలెగరేసే దొంగ
నీళ్ళున్నచోటికి ఎగిరిపోయే కొంగ
ఉదయకిరణాలు పోలీసుల్లా
వెదుకుతున్నాయి ఏదో తీవ్రంగా
పాపం వాటికి తెలీదు
రక్తకణాల్లో దాక్కొ ఉన్న దొంగల్ని
రాష్ట్రపతి కూడా పట్టుకోలేడు.

**********

ఒరే! ఈ దేశం మీకేమిచ్చింది?
వంకరటింకర్లుగా ఒంగే దేహం
బానిసత్వం మీద వ్యామోహం
మీరెగరేశే జెండా మీకేమిచ్చింది?
ఐదేళ్లకొకసారి ఓట్లు
ఆ మధ్యలో కునికిపాట్లు!

*********

31 Aug 2009

ప్రాగభావమా? ప్రధ్వంసాభావమా?

ఎన్నిసార్లు గుర్తుకుతెచ్చుకున్నానో ఈ పద్యాన్ని. తెలుగు బ్లాగులను అలా ఉబుసుపోక చదివిన ప్రతిరోజూ కనీసం ఒక్కసారి ఈ పద్యం గుర్తుకు వస్తుంది.
అసలే శ్రీనాథుడు. ఎర్రగారం తో సంకటి తిని ఒక పక్కన గొంతు మండిపోతున్నా, గంగకోసం పరమేశ్వరనితో పరాచికాలాడగల సమర్థుడు. అలాంటివాడు వ్రాసిన భీమేశ్వరపురాణం అన్న కావ్యాన్ని రాణ్మహేంద్రవరం పండితులు ఈర్ష కొద్దీ శుష్కవాదాలు చేసి తీవ్రంగా విమర్శించారట. మరి శ్రీనాథుడు ఊరుకుంటాడా? వారినుద్దేశించి క్రింది చాటు పద్యాన్ని చెప్పాడు. పద్యం అంటే అలాంటిలాంటి పద్యం కాదు. వెటకారాన్ని, వ్యంగ్యాన్ని ఇంత కసిగా వ్యక్తీకరించే పద్యం గానీ, వాక్యం గానీ నేను చూడలేదు. కొంచెం సున్నితమనస్కులకు, సంస్కారవంతులకూ పద్యం చదివేక జుగుప్సాకరం గా అనిపించొచ్చునేమో (ఏమో ఏమేమో అన్న ఊహాగానాలెందుకంటే - నేను సున్నితమనస్కుడినీ కాను, సంస్కారవంతుడిని అసలే కాను కాబట్టి). కానీ మనకేమనిపిస్తుందన్న విషయం పక్కన పెట్టి, ఒక్కసారి శ్రీనాథుని ప్రత్యర్థులకేమనిపించుంటుందని ఆలోచిస్తూ చదవాలి ఈ పద్యాన్ని నా సామిరంగా...నా పదకొండేళ్ళ కజిన్ భాషలో - "స్పైడర్-మాన్-కేక!" ( అంటే స్పైడర్ మాన్ అంత కేక అన్నమాట. మావోడు చాతుర్యాన్ని, వీరత్వాన్ని, బాగా నచ్చినవియాల్నీ ఇలా ’స్పైడర్ మాన్’ ల లో కొలిచి అప్పుడప్పుడూ కేకలు పెడుతుంటాడు). ఇంతకీ సదరు పద్యం ఇదిగో, ఇక్కడ:

హంసీయాన గామినికిన్నధమ రోమావళుల్ నభఃపుష్పముల్
సంసార ద్రుమ మూల పల్లవ గుళుచ్ఛంబైన యచ్చోట, వి
ద్వాంసుల్ రాజ మహేంద్ర పట్టణమునన్ ధర్మాసనంబుండి, ప్ర
ధ్వంసాభావము ప్రాగభావమనుచుం దర్కింత్రు రాత్రైకమున్


రాణ్మహేంద్రవరం లో పండితులు అలా ధర్మాసనం మీద కూర్చుని ఏ రీతిన చర్చిస్తుంటారయ్యా అంటే - "హంస నడకల కామిని దిగువ భగాన ఉండే రోమాలు(శష్పాలు) ఆకాశపుష్పాలు - అంటే అభావరూపాలు. రతికేళిలో వాటీ ప్రాముఖ్యం శూన్యం. సంసారవృక్షానికి మూలమైన చిగురు జొంపైన ఆ ప్రదేశం లో ఏర్పడిన అభావం ప్రధ్వంసాభావమా లేక ప్రాగభావమా? అంటే ముందుగా లేకుండుండుట అభావమా? లేక పుట్టి నశించడం అభావమా?"
అదీ సంగతి!!
అన్నట్టు "గామినికిన్నధమ" ఈ సంధి శ్రీనాథ ప్రయుక్తమేనట. సంధిపేరేమిటో తెలీదు. నేనైతే హంసీయాన సంధి అని గుర్తుపెట్టుకున్నా ;)

29 Jul 2009

పునర్జన్మ

ఒక స్నేహితునితో  దీని గురించి జరిపిన వ్యక్తిగత email సంభాషణ నుంచి -
"people say, one is to die without having any desires, so that one doesn't take another birth; and so on."

ఇప్పుడు  చదువు, విజ్ఞానం అని పిలువబడుతున్నవేవీ తెలియని నిరక్షరాస్యులైన మన నాన్నమ్మల తరం వారు కూడా అతి సాధారణంగా, వాడుకభాషలో అనే మాటలు "ఇంకేముంది నాన్నా.. ఏకోరికలూ లేకుండా చనిపోతే, ఇంకో జన్మలేకుండా ఆ పరమాత్ముని సన్నిధి చేరుకుంటే అదేచాలు" - అని. వ్యావహారికం లోకి పదాలు అప్రయత్నంగా చేరిపోవు కదా.. ఈ వాక్యాలకు వెనుక ఒక సిద్ధాంతం ఉంది . అది - కోరికలు లేకుండా ఉండే స్థితి (మోక్షం, పరమాత్మ, బ్రహ్మం లాంటి పదాలు అనవసరపు గందరగోళాన్ని సృష్టిస్తాయి. అవికూడా నినాదాలైపోయాయ్ ఈ మధ్యన) మానవ సహజ స్థితి కన్నా ఉచ్ఛమైనది అనీ మరియు ప్రతి మనిషి తెలిసో తెలియకో వివిధ రకాలు గా ఈ గమ్యం వైపే పయనిస్తాడనీ . ఈ ఆలోచన/సిద్ధాంతం మన ప్రాచీనులలో జీర్ణించుకుపోయి ఇలాంటి వ్యావహారికాలు వచ్చి ఉంటాయి. (మన ప్రాంతీయ భాషలు బ్రతకాలి అనుకోవడానికి ఇంకో కారణం ఇది. మన ప్రాచీనుల అనుభవాల వాహకం అయిన భాష మరణిస్తే, వారి అనుభవాలు, ఆలోచనలు మనకు ఎప్పటికీ అందుబాటులో లేకుండా పోతాయేమో.. కానీ ఇది వేరే విషయం, ఇప్పుడు మనం చర్చిస్తున్న దానితో సంబంధం లేనిది).

"Here, these junk swami-s, half-baked Indians give scientific gloss to rebirth and karma as though they are dependent on causality, without telling that what causality is"

ప్రాచీన భారతీయులు తమవంటూ కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించగలిగిన సమర్థత ఉందని ఇటీవలి కాలపు మన దేశపు మేధావులకే నమ్మకం లేదు. తమకు అర్థంకాని కొన్ని సిద్ధాంతాలను యూరోపియనులు తమకు తెలిసిన అన్ని ప్రశ్నాపద్ధతులనూ ఉపయోగించి విమర్శిస్తే రాజారామ్మోహనరాయ్, కేశబ్ చంద్రసేన్ మార్కు మేధావులు ప్రశ్నలను ఎదుర్కునే దిశలో యూరోపియనుల చరిత్రనూ/సిద్ధాంతాలనూ ఆకళింపుచేసుకుని తర్వాత సమాధానాలివ్వడం చేయకుండా, ఈ విమర్శలను స్వీకరించారు. సమాధానాలివ్వడం కోసమై ప్రతి ఒక్క సిద్ధాంతానికీ, సైన్సు యొక్క ఆమోదముద్ర  వేయాలని ప్రయత్నించారు. అది వారు నివసించిన కాలం, అప్పటి పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల కావచ్చును. వారిని క్షమించినా, అవే వివరణలు ఇచ్చి పునర్జన్మనూ, కర్మసిద్ధాంతాన్నీ సైన్సుతో రీ్ప్యాక్ చేసి జనానికి అమ్మజూసే ఇప్పటి అత్తెసరు మేధావులను, దొంగ సాముల్నీ క్షమించలేం!  పునర్జన్మ గట్రా లను  Causality మీద ఆధారపడతాయన్నట్లు గా ఇవ్వబడే వివరణలు నిజానికి అసలు వివరణలు కావు. వాటిని ర్థం చేసుకోవడానికి ఉపయోగపడే మన ప్రాచీనుల సైకాలజీని పోగొట్టుకున్నాం, intentional psychology తో వీటిని వివరించాలని చూసి ఈ సిద్ధాంతాలను నినాద స్థాయికి తీసుకొచ్చాం.

పునర్జన్మ, కర్మ వంటివి ఒక ఉచ్ఛస్థితిని చేరుకోవడానికి/వివరించడానికి మనవాళ్ళు అవలంభించిన cognitive strategies. ఈ వివరణలు కొన్ని సమస్యలను పరిష్కరిస్తాయి. they are a heuristic.

13 Jul 2009

వ్రాయడం ఎందుకు?

"రచయిత ఎప్పుడూ ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం వ్రాసేది ఎంతమందిని సముచ్చకితుల్ని చేస్తుంది ఎంతమందిని ఉత్తేజం చేస్తుంది, కదిలిస్తుంది, ఏ ఘనకార్యం సాగిస్తుంది? ఈ అంతర్గత బాధ కలగకుండా ఈ భావం స్ఫురించకుండా ఏదో రాస్తూ పోవడం ఎందుకు? చెప్పవలసిన అవసరం వచ్చినపుడే, ఏదో స్ఫురించినప్పుడే, ఏదో మెరిసినపుడే, ఏదో మనసులో ఒక జలపాతం ఘోషించినప్పుడే చెప్పు. అక్షర హార్యాలషరాలను రెచ్చగొట్టు అవి మిగతాపని చేస్తాయి. అంతే గాని ఎందుకో రాస్తే ఎల్లా? వ్రాయవచ్చు, పత్రికలు వేయవచ్చు. కానీ లోకానికి ఏమి ఉపకారం. న్యూస్ ప్రింట్ ఖర్చు తప్ప..."
  -శేషేంద్ర శర్మ


ఎంతమందిని ఉత్తేజం చేస్తుంది, ఏం సాధిస్తుంది అని ఆలోచిస్తే చెప్పదలచుకున్న విషయాన్ని సరిగ్గా చెప్పగలగటం కుదురుతుందా? మనసున విరిసే మెరుపులూ, ఘోషించే జలపాతాలు ఎవడేమనుకుంటాడో, ఎవడికి అర్థం అవుతుందో లేదో అని ఆగుతాయా?

6 Jul 2009

ఒక కప్పు అగ్నిరసం...

హైదరాబాదు సంస్థానాన్ని నిజాం ’ముసలి నక్క’ పరిపాలిస్తున్న రోజులు. ఉద్యమం లో రక రకాల వ్యక్తులూ, రక రకాల సంస్థలూ వారి వారి కి చేతనైన రీతుల్లో పాల్గొన్నారు. కొందరు శాంతియుతం గా సత్యాగ్రహం చేసి జైలుకెళితే, ఇంకొందరు అడవుల్లో రహస్య జీవనం గడుపుతూ రజాకార్ల ను ఎదుర్కునేవారు.

ఓ ముగ్గురు యువకులు ఇంకో దారి ఎంచుకున్నారు. నిజాం ను హతమార్చి హైదరాబాదు ను విముక్తం చేయటం. బాంబు దాడి. వారి పేర్లు - గండయ్య, నారాయణరావ్, జగదీష్.

మొత్తానికి ఆ ప్రయత్నం విఫలం అయ్యింది. నారాయణరావ్ విసిరిన బాంబు కారు తలుపు కు తగిలి క్రిందపడిపోయింది. నిజాం ఘాడు బ్రతికి బయటపడ్డాడు.

బాంబులు వేయటం నైతికమా, ఇది తీవ్రవాదమా అన్న విషయాలు పక్కన పెడితే - ఈ సన్నివేశం గురించి చదివి మళ్ళీ ఇక్కడికి రాసుకోవడానికి గల కారణం ఒక కవి.  బాంబుదాడిలో విఫలమై పోలీసుల చేతికి చిక్కిన నారాయణరావ్ గురించి వరంగల్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఉద్యమకారులకు తెలిసిందట. వారి లో వటికోట ఆళ్వార్ స్వామి, స్వామి రామానంద తీర్థ, దాశరథి కృష్ణమాచార్య, జంగారెడ్డి, బూర్గుల లాంటి వాళ్లున్నారు.  ఈ వార్త విన్న దాశరథి ఒక కవిత చెప్పాడు:

ఒక కప్పు అగ్నిరసం తాగించిన
నారాయణరావ్!
నీ హస్తం విసిరిన ’రవిగోళం’(గ్రనేడ్)
నరకాసుర మర్దనానికి
నడచిన యాదవయోధుని(కృష్ణుని)
కోదండ వినిర్గత బాణం.
నాల్గు డిసెంబరు నలభై యేడు
నారాయణరావ్!
నీలో అగ్ని సముద్రం ఉందట
నిజమేనా?
అగ్ని మనిషి!
నారాయణరావ్!

ఇవి కవితలో ని కొన్ని పంక్తులు మాత్రమే! అసలు దాశరథి చెప్పిన కవిత ఇంకా చాలా పెద్దదట.. కానీ ఆయన ఈ అనుభవాన్ని గ్రంథస్తం చేసే సరికి ది మాత్రమే గుర్తుందట.

దీని literary value ఎంతో నాకు తెలియదు కానీ (frankly, I dont care)... నన్నాకర్షించినది, మళ్ళీ ఆ సందర్భం. ఎవరు చెప్పారు కవితలు కడుపు నిండిన సోమరుల రసాస్వాదన సాధనాలని? యేళ్లు గడిచిపోయినాక, ఉద్యమంతో ఏ సంబంధం లేకపోయినా, చదువుతున్నప్పుడు వొంటి మీద రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్.  మరి ఈ దాశరథి అప్పట్లో తన సహచరులనూ, ఆ కాలపు యువతనూ ఎంతగా ప్రభావితం చేసుంటాడో!!

5 Jul 2009

సంకల్ప శక్తి - స్వామి బుద్ధానంద

ఒక మనిషిలో సంకల్పశక్తి నిర్మాణం కావాలంటే మొదట అతడు సమ్యక్ చింతనం (Right thinking) చేయాలి. దానితో సరియైన దారిని ఎంచుకోగలుగుతాడు. ఆ తర్వాత అతను ప్రగాఢ చింతనం (Deep thinking) చేయాలి. దీనితో అంతరాంతరాల్లోకి వెళ్ళిపోగలుగుతాడు. ఆ తర్వాత స్వేచ్ఛాచింతనం (Free thinking) చేస్తాడు. తనదైన సొంత గొంతుక విప్పే అవకాశం కలుగుతుంది. అప్పుడే అతని సృజనశక్తి వల్ల బ్రహ్మాండమైన వినూత్నావిష్కరణలు జరుగుతాయి. ఈ విషయం ఒక్క సాహిత్యానికే కాదు, అన్ని వినూత్నాంశాలకూ వర్తిస్తుంది.

-- స్వామి బుద్ధానంద.

ఇక్కడ సమ్యక్ చింతనం లోని సమ్యక్ ను ఎవరు నిర్ణయిస్తారు? ఎవరికి ఏది "సమ్యక్" ?

19 Jun 2009

గండ్రగొడ్డళ్ళు దొరికే గంధర్వలోకాలెక్కడ!

"ఓ జిజీవిషా! నీవు మాత్రం వర్థిల్లు, తెరచాపా తెగిపో, కెరటాల్లారా! ఉగ్ర రూపాలు ధరించండి, కుక్కల్లా నడవకండి... గాలీ! గాలివానల్ని పిలువ్. ఓ తీరమా! దూరమైపో, పడవా! పగిలిపో."

"సముద్రాలెక్కడ ఆకాశాన్ని పిడికిళ్ళతో పొడుస్తుంటాయో అక్కడికే పోతాను; తుఫానులతో స్నేహం చేస్తాను సింహాల సౌందర్యాన్నే ఉపాసిస్తాను. నా ప్రాణాలక్కడే పారేస్తాను..."

"నేనెక్కడున్నానని వెదుకుతుందీ లోకం! నిషాలన్నీ విడిచిపెట్టి ఇప్పుడు ఏ నిషాలో ఉన్నానో ఎలా తెలుసుకుంటుంది - జేబులో ఎ జ్ఞాపకాలు వేసుకువచ్చానో ఎవరికి తెలుసు? ఏ రాళ్ళకుటుంబాల్లో గుండె రెండుచేతుల్తో పుచ్చుకుని కన్నీటి బిందువులకోసం భిక్షాటన్ చేస్తున్నానో ఎవరికి తెలుసు -"

"నీ బాణానికి గురి ఎవరో శత్రువు నా బాణానికి గురి ఏదో హృదయం; గాలి వాలు తెలిసి ఎగిరిపడే పక్షివి నీవు గాలి కూడా భయపడే గమ్యం కోసం రగిలే పక్షిని నేను-"

ప్రతిభ అనే నేరం చేస్తే మీరు క్షమించరని నాకు తెలుసు కానీ నేను పుట్టేముందు నిర్దోషివి గా పుట్టమని నాకెవ్వరు చెప్పారు? దొరికిన నాలుగు సెకండ్లే జేబుల్లో వేసుకుని పోయే మీరెంత మంచివారు, కాలాన్నే మార్చాలని ఖడ్గమై ఇంకా ఊపిరి పీలుస్తున్న నేనెంత చెడ్డవాడ్ని - సిగ్గువిడిచి ఏకాకినని చెప్పుకోకు ఒక్క కన్నీటి బిందువు కూడా భిక్ష వెయ్యరు నీకు; గండ్రగొడ్డళ్ళు దొరికే గంధర్వలోకాలెక్కడున్నాయో వెతుక్కో మనిషికి ఒక యుగాన్నయినా ఇస్తావు-
                                                              ~శేషేంద్ర, సముద్రం నాపేరు                                                                                                                                                                    
పదం పదం, పేజీ పేజీ చదివేకొద్దీ నీ మీద నే మొదటిసారి లీలా మాత్రం గా ఏర్పరచుకున్న భావాన్ని బలపరుస్తున్నావ్ .  నిజం గానే నువ్వు నేనడక్కుండానే నా పాటలు పాడుతున్నావ్!! నా లాంటి వారెందరివో!!

కోయిల పాటలూ సెలయేళ్ల చప్పుళ్ళూ పువ్వుల పరిమళాలూ ఎన్నిరోజులని ఆస్వాదిస్తాం?

ఋతువులు మారుతై, సెలయేళ్ళు ఎండుతై, పువ్వులు వాడుతై, పాటలు ఆగుతై

కానీ శేషేన్! ఋతువులను సవాలు చేసి సెలయేళ్లను శివాలెత్తించి పూలను తూటాలుగా మలిచి
నీలోని ప్రపంచం కోసం, ప్రపంచంలోని నీకోసం నువ్ పాడిన ఈ యుద్ధపు పాటలు మటుకు ఇలాగే నన్నున్మత్తుడ్ని చేస్తుంటాయ్!!  
 

17 Jun 2009

ఓ గీతికా! విను-

ఓ గీతికా! విను-
ఏ పుణ్యం చేసుకున్నానో ఉల్కలా వచ్చిన
ఒక్క క్షణం కాంతిలో
జీవన కఠోర సత్యదర్శనం చేసుకుంటున్నాను;
నీ మోహినీత్వం తో నన్ను మోసం చెయ్యకు
నా అపూర్వ సంపదలాంటి ఈ క్షణాల్ని దొంగిలించుకునిపోకు,
నా బాధల్ని మరిచిపోనీకు.
మరిచిపోతే, నాచేత బద్దలుకావలసినవన్నీ క్షేమంగా ఉండిపోతాయ్
హేయ్! పువ్వులూ పక్షులూ! మీ గొంతులు కట్టి పెట్టండి
నా తుపాకీ నన్ను తీసుకోనీండి
అసహ్యతను సహిస్తూ నిద్రిస్తున్న మనస్సుల్ని మేల్కొల్పనీండి వాటిని భయంకర 
ఝంఝామారుతాలుగా మార్చనీండి
ద్వేషించే విద్య నేర్పనీండి
ద్వేషించడం ఎంత పవిత్ర వస్తువో బోధించనీండి; ద్వేషించడానికి 
కావలసిన స్పృహని నా రక్తం తో దానం చెయ్యనీండి -
గాలిలో ఉన్నా కాగితాలెక్కినా ఈ మాటలు వాళ్ళలో అగ్నిపర్వతాలు నాటనీండి
.
.
.
                                                             ~ నా దేశం, నా ప్రజలు; మహాకవి శేషేంద్ర.



నూరుకోట్ల నడిచే కళేబరాల్లోకి నీ కవితల సూదులు చెక్కి *కనీసం* ద్వేషాన్నయినా రగుల్చు!

27 Oct 2008

పసిడి గల్గు వాని బానిస కొడుకులు...

"కులము గలుగు వాడు గోత్రంబు గలవాఁడు
విద్య చేత విర్ర వీగువాఁడు
పసిడి గలుగు వాని బానిస కొడుకులు
విశ్వరాభిరామ వినుర వేమ"

On Happiness, Need and Conflicts - SN Balagangadhara

Insightful paper from one of the greatest philosopher I have known so far. SN Balagangadhara . Full paper here . How important is to teach t...