ఎన్నిసార్లు గుర్తుకుతెచ్చుకున్నానో ఈ పద్యాన్ని. తెలుగు బ్లాగులను అలా ఉబుసుపోక చదివిన ప్రతిరోజూ కనీసం ఒక్కసారి ఈ పద్యం గుర్తుకు వస్తుంది.
అసలే శ్రీనాథుడు. ఎర్రగారం తో సంకటి తిని ఒక పక్కన గొంతు మండిపోతున్నా, గంగకోసం పరమేశ్వరనితో పరాచికాలాడగల సమర్థుడు. అలాంటివాడు వ్రాసిన భీమేశ్వరపురాణం అన్న కావ్యాన్ని రాణ్మహేంద్రవరం పండితులు ఈర్ష కొద్దీ శుష్కవాదాలు చేసి తీవ్రంగా విమర్శించారట. మరి శ్రీనాథుడు ఊరుకుంటాడా? వారినుద్దేశించి క్రింది చాటు పద్యాన్ని చెప్పాడు. పద్యం అంటే అలాంటిలాంటి పద్యం కాదు. వెటకారాన్ని, వ్యంగ్యాన్ని ఇంత కసిగా వ్యక్తీకరించే పద్యం గానీ, వాక్యం గానీ నేను చూడలేదు. కొంచెం సున్నితమనస్కులకు, సంస్కారవంతులకూ పద్యం చదివేక జుగుప్సాకరం గా అనిపించొచ్చునేమో (ఏమో ఏమేమో అన్న ఊహాగానాలెందుకంటే - నేను సున్నితమనస్కుడినీ కాను, సంస్కారవంతుడిని అసలే కాను కాబట్టి). కానీ మనకేమనిపిస్తుందన్న విషయం పక్కన పెట్టి, ఒక్కసారి శ్రీనాథుని ప్రత్యర్థులకేమనిపించుంటుందని ఆలోచిస్తూ చదవాలి ఈ పద్యాన్ని నా సామిరంగా...నా పదకొండేళ్ళ కజిన్ భాషలో - "స్పైడర్-మాన్-కేక!" ( అంటే స్పైడర్ మాన్ అంత కేక అన్నమాట. మావోడు చాతుర్యాన్ని, వీరత్వాన్ని, బాగా నచ్చినవియాల్నీ ఇలా ’స్పైడర్ మాన్’ ల లో కొలిచి అప్పుడప్పుడూ కేకలు పెడుతుంటాడు). ఇంతకీ సదరు పద్యం ఇదిగో, ఇక్కడ:
హంసీయాన గామినికిన్నధమ రోమావళుల్ నభఃపుష్పముల్
సంసార ద్రుమ మూల పల్లవ గుళుచ్ఛంబైన యచ్చోట, వి
ద్వాంసుల్ రాజ మహేంద్ర పట్టణమునన్ ధర్మాసనంబుండి, ప్ర
ధ్వంసాభావము ప్రాగభావమనుచుం దర్కింత్రు రాత్రైకమున్
రాణ్మహేంద్రవరం లో పండితులు అలా ధర్మాసనం మీద కూర్చుని ఏ రీతిన చర్చిస్తుంటారయ్యా అంటే - "హంస నడకల కామిని దిగువ భగాన ఉండే రోమాలు(శష్పాలు) ఆకాశపుష్పాలు - అంటే అభావరూపాలు. రతికేళిలో వాటీ ప్రాముఖ్యం శూన్యం. సంసారవృక్షానికి మూలమైన చిగురు జొంపైన ఆ ప్రదేశం లో ఏర్పడిన అభావం ప్రధ్వంసాభావమా లేక ప్రాగభావమా? అంటే ముందుగా లేకుండుండుట అభావమా? లేక పుట్టి నశించడం అభావమా?"
అదీ సంగతి!!
అన్నట్టు "గామినికిన్నధమ" ఈ సంధి శ్రీనాథ ప్రయుక్తమేనట. సంధిపేరేమిటో తెలీదు. నేనైతే హంసీయాన సంధి అని గుర్తుపెట్టుకున్నా ;)
No comments:
Post a Comment