నీవు కాలేజికి పోతుంటే బాబూ
నిన్ను పొలాలు బిక్కమొహంతో చూస్తున్నాయి
నీవు కాలేజి గోడల్లోకి పోతావు
అక్కడ్నించి గవర్నమెంటు గోడల్లోకి పోతావు
ఆ తర్వాత ఎప్పుడూ ఎవ్వరూ
తిరిగిరాని గోడల్లోకి పోతావు
ఇక నీవు బ్రతికిందెప్పుడు?
బాబూ! నీ చిన్ని కన్నీటి బిందువులో
ఏ సముద్రం గర్జిస్తోందో నాకు తెలుసు
అందుకే చెట్లతో మొరపెట్టుకుంటున్నాను
ఆకులు కాదు తుపాకులు కాయండని-
ఇది రాసి ఎన్నేళ్ళయిందోగాని ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పేమీ లేదు. అప్పుడు గవర్నమెంటు గోడల్లోకి, ఇప్పుడు అమెరిక కలల్లోకి...
*********
బేటావాడ్ని మాత్రం నమ్మకు
వాడు జెండాలెగరేసే దొంగ
నీళ్ళున్నచోటికి ఎగిరిపోయే కొంగ
ఉదయకిరణాలు పోలీసుల్లా
వెదుకుతున్నాయి ఏదో తీవ్రంగా
పాపం వాటికి తెలీదు
రక్తకణాల్లో దాక్కొ ఉన్న దొంగల్ని
రాష్ట్రపతి కూడా పట్టుకోలేడు.
**********
ఒరే! ఈ దేశం మీకేమిచ్చింది?
వంకరటింకర్లుగా ఒంగే దేహం
బానిసత్వం మీద వ్యామోహం
మీరెగరేశే జెండా మీకేమిచ్చింది?
ఐదేళ్లకొకసారి ఓట్లు
ఆ మధ్యలో కునికిపాట్లు!
*********