పిపీలికాది బ్రహ్మ పర్యంతమైన సృష్టిలో వాల్మీకి జ్ఞాన నేత్ర పరిధిలో రానిది ఏదీ లేదు. గుడిసె తెలుసు, మహలు తెలుసు, మద్య మాంస మహిళామయ ప్రపంచం అంతా తెలుసు. కన్నీళ్ళు తెలుసు, కఠోర క్రూరత తెలుసు, యుద్ధాలు తెలుసు, విలాసాలు తెలుసు, పాందిత్యం తెలుసు పామరత్వం తెలుసు, రాజకీయాలు తెలుసు, రుషిత్వం తెలుసు, వేట తెలుసు, పాట తెలుసు; ఇది తెలుసు ఇది తెలియదు అని చెప్పడానికి వీలు లేదు. జ్ఞానంచేత ఆశ్చర్యం కల్గించే సర్వజ్ఞుడు! వాల్మీకి సౌందర్య సింధువు
కానీ వాల్మీకి ఎలాటివాడో మనమెరుగము. అతని కాలంలో ఉండి సమీపవర్తులమై అతన్ని మన రాగ ద్వేషాలకు గురిచేసి మనం అతన్ని ఏమాత్రమూ అర్థం చేసుకోగలిగి ఉండేవారము కాదు. ఎందురు క్షుద్రులు ఆయన్ని కవి కాదన్నారో! ఎందరు క్షుద్రులు ఆనాటి రాజులకు భట్రాజులై ప్రతిష్ట పొంది వాల్మీకిని అనాదరణ పాలుచేసారో!ఎందరు క్షుద్రులు తామే మహా కవులమని ఆశ్రయకళా మహిమచేత ఆయన్ని అధికార మందిరాల్లోకి అడుగు పెట్టనీలేదో, అప్పుడు మనం ఉండి ఉంటే అదంతా నిజమని నమ్మేవాళ్లం. మంచిదే అయింది. మనం ఆయన రక్త మాంసాకృతి ఎరిగిన వాళ్లంగాక ఆయన అక్షరాకృతిని ఎరిగినవాళ్లమయ్యాము. అందుచేతనే ఆయనెవ్వరో గుర్తించగలిగాము. కవి పుస్తకంలోనికి ప్రవేశించే ముందు మనం మన పాదరక్షలను ద్వారం దగ్గరే విడిచి వినీత మనస్కులమై ప్రవేశించాలని తెలుసుకోగలిగాము.
శేషేన్ - రక్తరేఖ